1-7 తరగతులకు రాష్ట్రంలో 'సీబీఎస్‌ఈ' సిలబస్ - 2021–22 నుంచి అమలు - సీఎం వైఎస్ జగన్ . విద్యా రంగంలో కీలక నిర్ణయం.. రాష్ట్రంలో 'సీబీఎస్‌ఈ' 2021–22 నుంచి అమలు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యలో సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి 1-7 తరగతులకు సీబీఎస్‌ఈసీ విధానం అమలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మనబడి, ‘నాడు-నేడు’ పనులు, విద్యాకానుకపై విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఉన్నతాధికారులతో జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఏడాదికి ఒక తరగతి చొప్పున 2024 నాటికి పదోతరగతి వరకు సీబీఎస్‌ఈసీ విధానం అమల్లోకి తేవాలని.. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
1-7 తరగతులకు రాష్ట్రంలో 'సీబీఎస్‌ఈ' సిలబస్ - 2021–22 నుంచి అమలు - సీఎం వైఎస్ జగన్
- మనబడి నాడు–నేడు పనులపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్ జగన్
- తొలుత 1 నుంచి 7 వరకు.. ఆ తర్వాత ఒక్కో ఏడాది ఆ పై తరగతులకు వర్తింపు
- 2024 నాటికి 1 నుంచి 10వ తరగతి వరకు సీబీఎస్‌ఈ విధానం
- నాడు–నేడు తొలి దశ పనులు మార్చి ఆఖరుకు పూర్తి కావాల్సిందే
- మంచి డిజైన్లు, ఇంటీరియర్‌తో స్కూళ్లు ఆకర్షణీయంగా ఉండాలి
- రెండో దశలో మరిన్ని మార్పులు.. నాణ్యతకు పెద్దపీట వేయాలి
- మనసా వాచా కర్మణ.. కమిటెడ్‌గా పని చేస్తేనే మంచి ఫలితాలు
విద్యా కానుక కిట్‌లో ఏది చూసినా నాణ్యతతో ఉండాలి. ఎక్కడా రాజీపడొద్దు. ఈ కిట్‌లో ఈసారి ఇంగ్లిష్ – తెలుగు డిక్షనరీని తప్పని సరిగా చేర్చాలి. దాని నాణ్యత కూడా బాగుం డాలి. టీచర్లకూ డిక్షనరీలు ఇవ్వాలి. పాఠ్య పుస్తకాలు కూడా ప్రైవేటు స్కూళ్లలో ఇస్తున్న పుస్తకాలకు నాణ్యతలో దీటుగా ఉండాలి.
– సీఎం వైఎస్ జగన్
రాష్ట్రంలో 2021–22 విద్యా సంవత్సరం నుంచి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) విధానం అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తొలుత 1 నుంచి 7వ తరగతి వరకు ఈ విధానం అమలు చేయాలని చెప్పారు. ఆ తర్వాత తరగతులకు ఒక్కో ఏడాది వర్తింప చేయాలని స్పష్టం చేశారు. 2024–25 విద్యా సంవత్సరం నాటికి 1 నుంచి 10వ తరగతి వరకు సీబీఎస్‌ఈ విధానం అమలులోకి తీసుకు రావాలని సూచించారు. మన బడి నాడు–నేడు పనులు, సీబీఎస్‌ఈ విధానం, పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రత, విద్యా కానుక, అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ, విద్యార్థుల హాజరుపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తొలి దశలో ప్రభుత్వ స్కూళ్లలో చేపట్టిన మన బడి నాడు–నేడు పనులను మార్చి నెలాఖరు కల్లా పూర్తి చేయాల్సిందేనని ఆదేశించారు. స్కూళ్లు ఆకర్షణీయంగా (కలర్ ఫుల్‌గా) మంచి డిజైన్లతో ఉండాలని సూచించారు. ఇంటీరియర్ వాతావరణం బాగుండాలని చెప్పారు. రెండో దశలో చేపట్టే పనుల్లో మరిన్ని మార్పులు చేయాలని, విద్యార్థులకు ఏర్పాటు చేసే బెంచ్‌లు సౌకర్యవంతంగా ఉండాలని సూచించారు. నాడు–నేడు కింద మౌలిక సదుపాయాలు కల్పించిన పాఠశాలల ఫొటోలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ పరిశీలించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..
అన్ని పాఠశాలలకు పక్కా భవనాలు
► ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలు లేని పరిస్థితి ఎక్కడా ఉండకూడదు. ఎక్కడైతే భవనాలు లేవో.. అక్కడ కచ్చితంగా భవనాలు నిర్మించాలి. రాష్ట్ర వ్యాప్తంగా పక్కా భవనాలు లేని 390 పాఠశాలలకు భవనాల నిర్మాణం నాడు – నేడులో భాగంగా శరవేగంగా జరగాలి.
► జగనన్న అమ్మ ఒడి కింద ఆప్షన్ తీసుకున్న విద్యార్థులకు ఇచ్చే ల్యాప్‌టాప్‌లలో నాణ్యత చాలా ముఖ్యం. వాటి సర్వీస్ పట్ల కూడా శ్రద్ధ పెట్టాలి.
అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ
► చిన్నారులకు బోధన ఎలా చేయాలన్న దానిపై అంగన్ వాడీ టీచర్లకు శిక్షణ ఇవ్వాలి. ప్రతి రెండు నెలలకోసారి వారు ఎంత వరకు నేర్చుకున్నారన్న దానిపై ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించాలి.
► పరీక్షలో ఉత్తీర్ణులు అయ్యారా? లేదా? అన్నదానితో సంబంధం లేకుండా వారు ఎంత వరకు శిక్షణ కార్యక్రమాల ద్వారా అప్‌గ్రేడ్ అయ్యారో పరిశీలించాలి. ఆ దిశగా వారికి శిక్షణ ఇవ్వాలి.
విద్యార్థుల హాజరుపై దృష్టి
► విద్యార్థుల హాజరుకు సంబంధించి తల్లులు, ఎడ్యుకేషన్ సెక్రటరీలు, వలంటీర్ల మ్యాపింగ్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించగా.. మార్చి 15 నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.
► స్కూళ్లలో టాయిలెట్ల నిర్వహణ, శుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. ఇప్పటికే 27 వేల మంది ఆయాలను నియమించామని అధికారులు వెల్లడించారు. మార్చి మొదటి వారంలో వీరందరికీ శిక్షణ ఇస్తామని చెప్పారు. పరికరాలు, లిక్విడ్స్ అన్నీ స్కూళ్లకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎంకు వివరించారు.
► ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, సమగ్ర శిక్షా అభియాన్ ఎస్‌పిడి వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.