ఏప్రిల్ లో నాడు-నేడు రెండో దశ - ప్రాధమిక విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్
మొదటిదశలో ప్రారంభించిన నాడు-నేడు పనులన్నిటినీ ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అధికారులను ప్రాథమిక విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ఆదేశించారు రెండవ దశ పనులు సుమారు రూ.4,400 కోట్లతో ఏప్రిల్ నుంచి ప్రారంభించనున్నామని తెలిపారు.బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నాడు -నేడు పనులపై ఇంజి నీర్లు, మండల విద్యా శాఖాధికారులతో ఆయన సమీక్షించారు పిల్లలకు ప్రశాంత వాతావరణంలో విద్యాభ్యాసం జరిగేలా, 5వ తరగతి వరకు ఆహ్లాదాన్ని అందించేలా, 10వ తరగతి వరకు నాలెడ్జ్ కలిగేలా తీర్చిదిద్దాలని అన్నారు. నాడు బ్లాక్ బోర్డులుఉండేవని... నేడు గ్రీన్ బోర్డులుగా మారిపోయాయని, భవిష్యతులో వైట్ బోర్డులుగా మారాలని అన్నారు. మొదటి దశలో కొన్నిచోట్ల కాంట్రాక్టర్లతో పని చేయించారని, రెండవ దశలో మాత్రం పూర్తిగా ప్రజల భాగస్వామ్యంతోనే జరగాలని సూచించారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండె మాట్లాడుతూ.. గిరిజన పాఠశాలలను కూడా ఆహ్లాదంగా తీర్చిదిద్దాలని, ప్రత్యేక సదుపాయాలను కల్పించాలని కోరారు. ప్రాథమిక విద్యా సలహాదారు మురళి మాట్లాడుతూ.. నాడు- నేడు పనులలో ఎక్కువగా వచ్చే సాంకేతిక సమస్యలు, చెల్లింపులపై వివరించారు సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.