రుణ మారటోరియంపై సుప్రీం తీర్పు
మొత్తం వడ్డీ మాఫీ అంశంలో జోక్యం చేసుకోలేం : సుప్రీం
ప్రత్యేక ఆర్థిక ఉపశమనం లేదా ప్యాకేజీలను ప్రకటించమని ప్రభుత్వాన్ని, ఆర్‌బీఐని ఆదేశించలేం
ప్రత్యేక రంగాలకు ఉపశమనాన్ని కోరలేం
మారటోరియం కాలానికి రుణాలపై ఎలాంటి చక్రవడ్డీ విధించొద్దని ఆదేశించింది. అయితే ఆగస్టు 31 వరకు ఉన్న మారటోరియం కాలాన్ని పొడగించాలని కేంద్రాన్ని ఆదేశించలేమని స్పష్టం చేసింది.
మారటోరియంపై సుప్రీం తీర్పు - మారటోరియం కాలాన్ని పొడిగించలేం - వడ్డీ మాఫీ అంశంలో జోక్యం చేసుకోలేం
కరోనా, లాక్‌డౌన్ సమయంలో రుణాలపై విధించిన మారటోరియం పొడిగింపు, మొత్తం వడ్డీని మాఫీ చేయడం లాంటి అంశాలపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే ఆరు నెలల రుణ మారటోరియంను పొడిగించాలని కోరుతూ వివిధ వాణిజ్య సంఘాలు, కార్పొరేట్ సంస్థల పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మంగళవారం తన తీర్పును ప్రకటించిన సుప్రీం వడ్డీని పూర్తిగా మాఫీ చేయలేమని పేర్కొంది. అలాగే మాలాఫైడ్, ఏకపక్షంగా ఉంటే తప్ప కేంద్రం ఆర్థిక నిర్ణయాలను న్యాయ సమీక్ష చేయలేమని పేర్కొంది. ప్రత్యేక ఆర్థిక ఉపశమనం లేదా ప్యాకేజీలను ప్రకటించమని ప్రభుత్వాన్ని లేదా కేంద్ర బ్యాంకును ఆదేశించలేమని, ప్రత్యేక రంగాలకు ఉపశమనం అడగలేమని కూడా సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది.
ఆర్థిక ప్యాకేజీలు, ఉద్దీపనలు ప్రకటించాలని ప్రభుత్వానికి, రిజర్వ్‌బ్యాంకుకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని మంగళవారం సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మారటోరియం కాలానికి రుణాలపై ఎలాంటి వడ్డీపై వడ్డీ విధించొద్దని కోర్టు ఆదేశించింది. ఒకవేళ ఇప్పటికే వసూలు చేస్తే ఆ మొత్తాన్ని రుణగ్రహీతలకు సర్దుబాటు చేయాలని సూచించింది. అయితే.. ఆగస్టు 31 వరకు ఉన్న రుణ మారటోరియం కాలాన్ని పొడగించాలని కేంద్రాన్ని ఆదేశించలేమని స్పష్టం చేసింది. కొవిడ్ మహ్మమారిని దృష్టిలో పెట్టుకుని మారటోరియం కాలంలో వడ్డీపై వడ్డీని మాఫీ చేయాలని, మారటోరియంను పొడిగించాలని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన అనంతరం సుప్రీం ఈ తీర్పు వెలువరించింది. ఆర్థిక విధానాల్లో న్యాయపరమైన సమీక్ష చేపట్టలేమని కోర్టు వెల్లడించింది. అలాగే ఇప్పటికే రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీని కేంద్రం మాఫీ చేసిందని కోర్టు ఈ సందర్భంగా వెల్లడించింది
చక్రవడ్డీ మాఫీ రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలకు పరిమితం చేయడంలో హేతుబద్ధత లేదన్న సుప్రీంకోర్టు.. రూ.2 కోట్ల కంటే ఎక్కువ ఉన్న రుణాలపై కూడా చక్రవడ్డీని మాఫీ చేయాలని ఆదేశించింది. అయితే మారటోరియం కాలంలో రుణాలపై వడ్డీని పూర్తిగా మాఫీ చేయమని చెప్పలేమని కోర్టు స్పష్టం చేసింది. ఎందుకంటే డిపాజిటర్లకు, పెన్షనర్లకు బ్యాంకులు వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉన్నందున పూర్తి వడ్డీని మాఫీ చేయడం సాధ్యం కాదని కోర్టు తెలిపింది.
చక్రవడ్డీని మాఫీ చేయడం వల్ల బ్యాంకులపై గణనీయమైన ఆర్థిక భారం పడుతుందని, ఇది డిపాజిటర్లు, విస్తృత ఆర్థిక స్థిరత్వానికి భారీ చిక్కులు తెచ్చిపెడుతుందని ఆర్బీఐ తన అఫిడవిట్‌లో పేర్కొంది. అలాగే ఆర్‌బీఐ ప్రకటించిన ఆరు నెలల మారటోరియం కాలానికి రుణాలు, అడ్వాన్స్‌లపై వడ్డీని వదులుకుంటే.. ఆ మొత్తం రూ.6లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఉంటుందని ఇది వరకే కేంద్రం సుప్రీంకు వెల్లడించింది. ఈ భారాన్ని బ్యాంకులు భరిస్తే..దీర్ఘకాలంలో పెను భారం పడుతుందని గుర్తు చేసింది
మహమ్మారి కారణంగా మార్చి 1, 2020 నుంచి మే 31, 2020 వరకు మారటోరియం ప్రకటిస్తున్నామని, రుణాలు, వడ్డీలకు సంబంధించిన కిస్తీల చెల్లింపును వాయిదా వేసుకోవచ్చని పేర్కొంటూ మార్చి 27న రిజర్వు బ్యాంకు సర్క్యులర్ జారీచేసింది. ఆ తరవాత దాన్ని ఆగస్టు 31 వరకు పొడిగించింది