Diabetes: క్లోమాన్ని ప్రేరేపించే పీకే2ను ఏ దేశ శాస్త్రవేత్తలు గుర్తించారు?

మధుమేహానికి నోటి ద్వారా తీసుకునే సరికొత్త మందు అభివృద్ధి దిశగా భారత పరిశోధకులు ముందడుగు వేశారు. ఇన్సులిన్‌ ను విడుదల చేసేలా క్లోమాన్ని ప్రేరేపించే పదార్థాన్ని వారు గుర్తించారు. దీన్ని పీకే2గా పిలుస్తున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీలో ఉన్న ఐఐటీ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయికి అనుగుణంగా క్లోమంలోని బీటా కణాలు సరిపడినంత ఇన్సులిన్‌ ను ఉత్పత్తి చేయకపోవడం మధుమేహానికి దారితీస్తుంది. ఇన్సులిన్‌ విడుదలలో అనేక జీవరసాయన ప్రక్రియలకు పాత్ర ఉంటుంది. బీటా కణాల్లోని జీఎల్‌పీ1ఆర్‌ ప్రొటీన్‌ కూ ఇందులో ప్రమేయం ఉంది. భోజనం చేశాక విడుదలయ్యే జీఎల్‌పీ1 అనే హార్మోనల్‌ పదార్థం.. జీఎల్‌పీ1ఆర్‌కు అంటుకొని, ఇన్సులిన్‌ విడుదలను ప్రేరేపిస్తుంది. ఎక్సెనాటైడ్, లిరాగ్లుటైడ్‌ వంటి ఔషధాలు కూడా జీఎల్‌పీ1 పాత్రను పోషిస్తూ ఇన్సులిన్‌ విడుదలకు దోహదపడతాయి. ఈ ఔషధాలకు ప్రత్యామ్నాయాలను కనుగొనేందుకు శాస్త్రవేత్తల బృందం కంప్యూటర్‌ సిమ్యులేషన్‌ విధానాలను ఉపయోగించింది. జీఎల్‌పీ1ఆర్‌తో బంధాన్ని ఏర్పరిచే సామర్థ్యమున్న పదార్థాల కోసం శోధించారు. పీకే2 వైపు మొగ్గారు. ఇన్సులిన్‌ ఉత్పత్తి చేసేలా బీటా కణాలను ప్రేరేపించే సత్తా ఈ పదార్థానికి ఉందని ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో వెల్లడైంది. పీకే2ను జీర్ణాశయ వ్యవస్థ వేగంగా గ్రహించగలుగుతోందని, దీన్ని ఇంజెక్షన్‌ రూపంలో కాకుండా నోటి ద్వారా తీసుకునే మందులా వాడొచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు. నష్టపోయిన బీటా కణాలనూ పునరుద్ధరించే సత్తా దీనికి ఉందని గుర్తించారు.

Gaganyaan: ఎస్‌–200 బూస్టర్‌ ప్రయోగాన్ని ఎక్కడ నుంచి నిర్వహించారు?

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : ఎస్‌–200 స్ట్రాపాన్‌ బూస్టర్‌ ప్రయోగం విజయవంతం
ఎప్పుడు : మే 13
ఎవరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)
ఎక్కడ : సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌), శ్రీహరికోట, తిరుపతి జిల్లా
ఎందుకు : గగన్‌యాన్‌–1 ప్రయోగంలో భాగంగా..

Lunar Soil: ఏ దేశ శాస్త్రవేత్తలు.. తొలిసారిగా చంద్రుడి మట్టిలో మొక్కలు పెంచారు?

జాబిల్లిపై ప్రయోగాల్లో అమెరికా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. 50 ఏళ్ల క్రితం చంద్రుడిపై నుంచి తీసుకువచ్చిన మట్టిలో మొదటిసారిగా ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు మొక్కలు పెంచి చూపించారు. దీంతో చంద్రుడిపై వ్యవసాయం చేయడం సాధ్యమేనన్న విశ్వాసం కలిగిందని అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) వెల్లడించింది.


ఏ మొక్కలు పెంచారు?

మొదటిసారి ప్రయోగాత్మకంగా ఆఫ్రికా, యురేషియాల్లో లభించే ఆవాలు, కాలీఫ్లవర్‌ జాతికి చెందిన అరబిడోప్సిస్‌ థాలియానా మొక్కల్ని చంద్ర మృత్తికలో పెంచారు. ఈ మొక్కలకి సహజంగా చాలా త్వరగా పెరిగే గుణం ఉంటుందని వాటిని ఎంపిక చేసుకున్నట్టుగా నాసా అడ్మినిస్ట్రేటర్‌ బిల్‌ నెల్సన్‌ చెప్పారు. వీరి అధ్యయనం వివరాలను జర్నల్‌ కమ్యూనికషన్స్‌ బయాలజీ ప్రచురించింది.

మొక్కల్ని ఇలా పెంచారు..చంద్రుడి నుంచి అపోలో మిషన్‌ 11, 12, 17 సమయంలో మట్టిని తీసుకువచ్చి 50 ఏళ్లకుపైగా అయింది. ఈ మట్టిలో మొక్కల్ని పెంచారు.
చంద్రుడిపై మట్టికి, భూమిపై లభించే మట్టి మధ్య చాలా తేడాలుంటాయి. సహజసిద్ధంగా మట్టిలో ఎరువులుగా పని చేసే కీటకాలు, బ్యాక్టీరియా, తేమ చంద్రుడి నుంచి తెచ్చిన మట్టిలో ఉండవు. అందుకే ఇందులో మొక్కలు పెంచడాన్ని ఒక సవాల్‌ తీసుకున్నారు.
అతి చిన్న కుండీలను తీసుకొని చంద్రుడి మట్టి ఒక్కో గ్రాము వేశారు. అందులో నీళ్లు పోసి విత్తనాలు నాటారు. వాటిని ఒక గదిలో టెర్రారియమ్‌ బాక్సుల్లో ఉంచారు. ప్రతీ రోజూ వాటిలో పోషకాలు వేస్తూ వచ్చారు. రెండు రోజుల్లోనే ఆ విత్తనాలు మొలకెత్తాయి.

ఎలా పెరిగాయి?

చంద్రుడిపై వ్యవసాయానికి వీలు కుదురుతుందా ? భవిష్యత్‌లో చంద్రుడిపై పరిశోధనల కోసం మరిన్ని రోజులు వ్యోమగాములు గడపాలంటే వారికి కావల్సిన పంటలు అక్కడ పండించుకోవడం సాధ్యమేనా? అన్న దిశగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. ఇందులో చంద్రుడి మట్టిలో వ్యవసాయం సాధ్యమేనని తేలింది. అయితే ఈ మొక్కలు భూమిపై పెరిగినంత బలంగా, ఏపుగా పెరగలేదని తేలింది.

Shukrayaan-I: శుక్ర గ్రహ కక్ష్యకూ పరిశోధక నౌకను పంపనున్న దేశం?
చంద్రుడు, కుజుడి(మార్స్‌)పైకి విజయవంతంగా వ్యోమ నౌకలను పంపిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో).. 2024 డిసెంబరులో శుక్ర గ్రహ కక్ష్యకూ పరిశోధక నౌకను పంపనుంది. సౌర కుటుంబంలోకెల్లా అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలకు నెలవైన శుక్రుని కక్ష్యలో తమ నౌక పరిభ్రమిస్తుందని ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ వివరించారు. ‘శుక్ర గ్రహ సైన్స్‌’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ‘శుక్రునిపై ఎల్లప్పుడూ దట్టమైన సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ మేఘాలు అలుముకుని ఉంటాయి. ఆ మేఘాల కింద శుక్రుని ఉపరితలాన్ని తమ నౌక కక్ష్య నుంచే శోధిస్తుంది’ అని చెప్పారు. 2024 డిసెంబరులో శుక్రుని చేరుకునే ఇస్రో వ్యోమ నౌక.. 2025 జనవరి నుంచి శుక్ర కక్ష్యలో విన్యాసాలు పారంభిస్తుంది. 2025లో భూమి, శుక్రుడు ఒకే రేఖ మీదకు ఉంటాయి కాబట్టి, రెండు గ్రహాల మధ్య దూరం తగ్గుతుందని సోమనాథ్‌ వివరించారు.

Chandrayaan Mission: చంద్రుడిపై నీటికి భూమే ఆధారం
చంద్రుడిపై నీటిజాడలను భారతీయ చంద్రయాన్‌ మిషన్‌ నిర్ధారించి 14 ఏళ్లవుతోంది. చంద్రుడిపై నీటికి భూమే ఆధారమని తాజాగా అలాస్కా యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. భూమి ఉపరితల వాతావరణ పొరల నుంచి తప్పించుకున్న హైడ్రోజన్, ఆక్సిజన్‌ అయాన్లు చంద్రుడిపై చేరి ఉంటాయని.. అక్కడ వీటి సంయోగం ద్వారా నీటి అణువులు ఉద్భవించాయని తెలిపారు. చంద్రుడి ఉపరితలం లోపల పల్చని మంచురూపంలో దాదాపు 3,500 క్యూబిక్‌ కిలోమీటర్ల మేర నీరు వ్యాపించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ వివరాలను జర్నల్‌ సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌లో ప్రచురించారు. భూమి మాగ్నటోస్పియర్‌ పరిధిలోకి చంద్రుడు ప్రతినెలా ఐదురోజులు వస్తాడు. ఆ సమయంలో భూమిపై నుంచి ఆక్సిజన్, హైడ్రోజన్‌ అయాన్లు భూమి ఆకర్షణను తప్పించుకొని చంద్రుడిపైకి చేరి ఉంటాయని.. ఇది లక్షల ఏళ్ల పాటు జరిగిన ప్రక్రియని వివరించారు. తాజా వివరాలు భవిష్యత్‌ అంతరిక్షయానాలకు ఉపయోగపడతాయని తెలిపారు.


Mission to Venus: శుక్రయాన్‌ మిషన్‌ను చేపట్టనున్న దేశం?




చంద్రయాన్, మంగళ్‌యాన్‌ పేరిట ఇప్పటికే చంద్రునిపైకి, మార్స్‌పైకి మిషన్లను పంపిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రోa) ఇక శుక్రయాన్‌పై దృష్టి పెట్టింది. వచ్చే రెండేళ్లలో శుక్ర గ్రహంపైకి శుక్రయాన్‌ మిషన్‌ను పంపనుంది. ఈ మిషన్‌ ద్వారా శుక్ర గ్రహ ఉపరితలంతో పాటు దాన్ని ఆవరించి ఉన్న సల్ఫ్యూరిక్‌ ఆమ్ల మేఘాలు తదితరాల గుట్టు విప్పాలని భావిస్తోంది. 2024 డిసెంబర్‌కల్లా మిషన్‌ను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ మే 4న ప్రకటించారు. ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం..

శుక్రుని ఉపరితలంపై చురుగ్గా ఉన్న అగ్ని పర్వతాల హాట్‌స్పాట్స్, లావా ప్రవాహాలు, అక్కడి వాతావరణం తదితరాలకు సంబంధించి మరింత సమాచారాన్ని శుక్రయాన్‌ ద్వారా రాబట్టనున్నారు.
ఇస్రోకున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అతి తక్కువ సమయంలో శుక్రయాన్‌ మిషన్‌ తయారీ, ప్రయోగం సాధ్యమే
శుక్రయాన్‌లో వాడే సబ్‌ సర్ఫేస్‌ రాడార్‌ శుక్రుని ఉపరితలం నుంచి 100 మీటర్ల లోపలికి చొచ్చుకుపోయి పరీక్షలు జరుపుతుంది.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : 2024 డిసెంబర్‌కల్లా శుక్రయాన్‌ మిషన్‌ను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
ఎప్పుడు : మే 04
ఎవరు : ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌
ఎందుకు : శుక్ర గ్రహ ఉపరితలంతో పాటు దాన్ని ఆవరించి ఉన్న సల్ఫ్యూరిక్‌ ఆమ్ల మేఘాలు తదితరాల గుట్టు విప్పాలని..






Previous Post Next Post